కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని 75 దేవాలయాలకు, ధూప దీప నైవేద్య పథకం కింద మంజూరైన పత్రాలను దేవాలయ అర్చకులకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అందజేయడం పట్ల శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ హర్షం వ్యక్తం చేశారు.
ఆదివారం ఒక పత్రికలో నియామక పత్రాలు అందించండి అన్న శీర్షికతో ప్రచురితమైన వార్తకు స్పందించిన యంత్రాంగం ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుటాహుటిన సభ్యులను సమావేశపరిచి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆలయ అర్చకులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అర్చకులకు ధూపదీప నైవేద్యం పథకం రావడానికి ఒంటరి పోరాటం చేసిన హరిహర అర్చక సంఘం అధ్యక్షుడు శ్రీరంగం గోపీకృష్ణమాచార్యుల కృషిని అభినందించారు.
నియోజక వర్గంలో అర్చకులకు పథకం అమలవ్వడానికి సహాయసహకారాలు అందించిన ఎమ్మెల్యే కెపి వివేకానందకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో అర్హత కలిగిన అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం అమలయ్యేలా తమవంతు ప్రయత్నం చేస్తానని శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ పేర్కొన్నారు.