ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతోపాటు ఆలయ నగరిని మరింత విస్తృతితో, విశేషాలతో తీర్చిదిద్దుతున్నారు. ఆలయం, ఆలయ నగరం రెండింటి నిర్మాణం ఒకేసారి చేపట్టడం సాహసమే. ఆలయానికి అంతకు ముందున్న ఇరుకైన స్థలాన్ని విశాలం చేసేందుకు దక్షిణం వైపునుంచి నూరడుగుల విస్తృతిని పెంచి, కుడ్య నిర్మాణం చేసి, దాని ఎత్తుకు తగ్గట్టు సమతలమయ్యేలా భూతలం పెంచి ఒక ఆకాశహర్శ్యం మాదిరి నిర్మించారు. గుట్ట కింద ఆలయ నగరాన్ని 1,100 ఎకరాలకు ప్రణాళికచేసి, 832 ఎకరాలను ఇప్పటికే సేకరించారు.
సకల సౌకర్యాల నగరి: ఆలయంలో శిల్పం, సౌందర్యం, ఆగమశాస్త్ర నిబద్ధతవలెనే గుట్టమీద ఆలయం చుట్టూరా ప్రాంతంతోపాటు, కింద ఆలయ నగరిలో విశాలత, భక్తకోటికి సౌకర్యాల కోసం నిబద్ధమైన ప్రణాళికలు ఏర్పరిచారు. వసతి భవనాలు, పెండ్లిళ్లకు కళ్యాణ మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం, విస్తృత పుష్కరిణి, కళ్యాణకట్ట (తల నీలాలిచ్చే మంటపాలు), ‘అతి ముఖ్యుల’ కోసం వసతి భవనాలు, లంకె రహదారులు, లిఫ్టులు, క్యూ కాంప్లెక్స్‌లు, పార్కింగ్ ప్లేస్‌లు, రింగ్ రోడ్డులు, మెట్ల దారి, ఆ మెట్ల దారిలో సౌకర్యాలు, గిరి ప్రదక్షిణా పథాలు, పచ్చిక బయళ్లు, నిత్యాన్నదాన మందిరాలు- వాటి వంటశాలలు, ప్రసాద విక్రయశాలలు- ఇలా ఆలయ నగరిలో అనేక విధాల నిర్మాణాలు భవిష్యత్తులో భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్మితమయ్యాయి. ఒకేసారి 1000 మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. 300 గదులను తులసికోట దగ్గర నిర్మాణం చేసారు. 1300 ఎకరాల్లో అతిముఖ్య సందర్శకుల బస కోసం వసతి భవనాలు ఒక్కొక్కటి ఏడున్నర కోట్ల రూపాయల విరాళాల సేకరణతో కట్టించారు. పైన ప్రధానాలయంతోపాటు పాత పుష్కరిణి స్థానంలో విష్ణు పుష్కరిణిని సిద్ధంచేశారు. దీనిలోనే తెప్పోత్సవం, చక్రతీర్థాది బ్రహ్మోత్సవాల సంప్రదాయ విధులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.