చిన్నప్పుడు మా ఊరిలో ఆరాధన రోజున వీర బ్రహ్మేంద్ర స్వామి నాటిక వేసేవారు. అప్పుడప్పుడు మైకులో శ్లోకాలు పెట్టేవారు. ఆ నాటికలో దొంగ బాబాలు వచ్చేరయా అని ఉండేది. అది 5/6 ఏళ్ల వయసులోనే మనసులో పడి పోయింది. దానితో ఎవరు కాషాయ వస్త్ర ధారణ చేసినా కూడా, దొంగ స్వాములు వస్తున్నారు, స్వామి వారు ఎప్పుడో చెప్పారు గా వీళ్ళే అనుకొనే వాడిని. మా ఊరు ఎంతో మంది బాబాలు వస్తూ ఉండే వారు, వారికి పోయి కాళ్ళకి దండం పెడితే, అరటిపండు ఇస్తారు అని పిల్లలు అంతా పోతుండేవారు. నేను మాత్రం వెళ్ళే వాడిని కాను.
దూరంగా నిలబడి చూస్తూ ఉండేవాడిని.
ఇంటర్ లో ఉన్నప్పుడు మా మంచి మిత్రుడు TRKH ప్రసాద్ గారి ఇంటికి నెల్లూరు జిల్లా ఇనమడుగు సచ్చిదానంద ఆశ్రమం మఠాధిపతి వారు తరచుగా వస్తూ ఉండేవారు. నేను ఆయనతో చాలా సన్నిహితంగా మాట్లాడుతూ ఉండే వాడిని. ఆయనకు కావలసిన అవసరాలు తీర్చుతుండేవాడిని. కొన్ని సామాజిక పరిస్థితులు మీద చర్చలు కూడా నడిచేవి మా మధ్య. నేను పూర్తిగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ప్రవచించిన విశ్వ మానవ సౌభ్రాతృత్వం – మానవత్వం గురించి చెప్పేవాడిని. వారికి RSS భావజాలం మెండుగా ఉండేది. తదనంతర కాలంలో నేను ABVPలో పని చేశాను అది వేరే విషయం.
అప్పుడు ఒక సారి చిన్న స్వామి, నన్ను మెడలు వంచినట్టు గా ఈరోజు నేను నిన్ను దీవించాలి, దండంపెట్టు అని పట్టుకొన్నారు. నాకు తప్పలేదు, అన్య మనస్కం గానే దండం పెట్టాను కాళ్ళకి. అయన ఏమీ దీవించారు అనేది నాకు తెలియదు. తదనంతర కాలంలో కొన్ని సార్లు ఇనమడుగు సచ్చిదానంద అశ్రమంకు వెళ్ళడం జరిగింది. మా మిత్రుడు చెప్తూ ఉండేవాడు, శ్రీనివాస్ చాలా ఉన్నత విలువలు కలవాడు, మంచి వాడు, పట్టిన దాని కోసం ఎంతకైనా పోరాడే తత్వం ఉన్నది అని చిన్న స్వామి అన్నట్టుగా. ఆ తరువాత అనేక పరిణామాలలో నేను మొదటి సారిగా 1999 జూలై/ఆగస్ట్ లో మనస్పూర్తిగా కాకినాడ లో మా SSY యోగ గురువు – శ్రీ సాయి బాబా గారికి సాష్టాంగ ప్రణామం చేయడం జరిగింది.
ఆ తరువాత ఒక వ్యక్తి చేతులు పట్టుకుంటే తప్పుగా ఫీల్ అవడం లేదు, వారి శరీరంలో మరో బాగమయిన కాళ్ళు పట్టుకుంటే తప్పు ఏమీ ఉన్నది అనే లాజిక్ నాలో పెరిగిపోయింది. అది ఆత్మ జ్ఞానం అనుకోవచ్చు, ఒక అలౌకిక బావన అనుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎవరి కాళ్ళకి నమస్కారం పెట్టాలన్న సంశయము లేదు. నేను ఎప్పుడు స్వామి వారు చెప్పినట్టు మనిషిలో దైవత్వం చూడాలి, మానవత్వంతో మనుషులను ప్రేమించాలనుకునేవాడని కానీ, గుడులకి పోయి మొక్కు కొంటే ఏదో వస్తుందనే ఆలోచన నాలో ఉండేది కాదు. అసలు ఎప్పుడు నా కోసం మొక్కు కోలేదు నేను దేవుడిని. ఈ మధ్య కాలంలో మాత్రమే ఒక కోరికకు దైవ సంకల్పం కూడా అవసరమని కోరుకోవడం జరిగింది, అది కూడా నా కోసం కాదు…. అలా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది నా మీద చిన్నప్పటి నుంచి.
ప్రత్యేక కధనం by శ్రీనివాసులు పాలెపు … జై వీర బ్రహ్మ జై…