Srikanth : ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు శ్రీకాంత్. దాదాపు 100 సినిమాలకు పైగా హీరోగా నటించిన శ్రీకాంత్ ఈ మధ్య కాలంలో కాస్త వెనుకబడ్డారు. హీరోగా క్లాస్ మాస్ ఆడియన్స్ ను అలరించిన ఈ సీనియర్ హీరో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అలరించారు. రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే, అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో నటించి అలరించారు. అయితే గత కొంతకాలంగా శ్రీకాంత్, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ తరుణంలోనే తాజాగా శ్రీకాంత్ ఈ వార్తలపై స్పందించాడు. కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను ఎవరు పుట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు… ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని వెబ్ సైట్స్ లో వచ్చిన ఈ అసత్య వార్తలను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మొద్దు, ఆందోళన పడవద్దు అని తనను ఓదార్చాను. అయితే ఏవో కొన్ని చిల్లర సైట్స్, యూట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్‌గా అనిపిస్తుంది అని తెలిపారు.