Missing Case : తిరుపతిలో పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. నెహ్రూ నగర్ లోని అన్నమయ్య స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థులు ఈరోజు ఉదయం నుంచి కనిపించడం లేదు. ఆ ఐదుగురు విద్యార్ధులు కుటుంబ సభ్యులకు ట్యూషన్ కు వెళ్తున్నామని చెప్పి… ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థులు ఉదయం 6గంటల 15 నిమిషాలకు ట్యూషన్ కోసం అని స్కూల్ కి వెళ్ళినట్లు వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా విద్యార్థులు ఏమయ్యారు ? ఎక్కడ ఉన్నారు ? ఎక్కడికి వెళ్లారు ? వాటి కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం అందుతుంది. తమ పిల్లల క్షేమ సమచారం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనిపించకుండా పోయిన ఐదుగురు విద్యార్థుల ఆచూకీ కోసం ఉదయం నుంచి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
తెల్లవారు జామున 8 గంటల నుంచే ఆ విద్యార్దులు స్కూల్ లో కనిపించకుండా పోయినట్లు తెలుస్తుంది. స్కూల్లో ట్యూషన్ కి హాజరు అయిన విద్యార్దులు… ఆ తర్వాత బయటకు వెళ్లారు. స్కూల్ బయట ఉన్న సీసీ ఫుటేజీ లను పరిశీలించగా అందులో ఇద్దరు అమ్మాయిల దృశ్యాలు కనిపించాయి. మరికొన్ని సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చాలా గంటలు గడిచినప్పటికీ పిల్లల ఆచూకీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది టెన్షన్ పడుతున్నారు. పిల్లల్ని ఎలా అయిన జాగ్రత్తగా తీసుకొస్తామని పోలీసులు భరోసా కల్పిస్తున్నారు.