Krishna : సూపర్‌స్టార్ కృష్ణ తెలుగు సినిమా ఖ్యాతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన హీరో అని చెప్పడంలో సందేహం లేదు. అటువంటి ఒక లెజెండరీ హీరో దివికెగడం యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రిని దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు సినిమాలోనే కాకుండా… మరే హీరోకి కూడా సొంతం కానీ రికార్డులను కృష్ణ సొంతం చేసుకున్నారు. 340కి పైగా చిత్రాల్లో సూపర్‌స్టార్ కృష్ణ నటించటం విశేషం. 1972లో 18 సినిమాల్లో, 1973 లో 15 చిత్రాల్లో, 1974లో మళ్లీ పదికి పైగా మూవీస్‌లో కృష్ణ నటించారు. ఇలా మూడు షిఫ్టులలో కంటిన్యూగా పని చేసిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుంది.
తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో కలిసి దేవుడు చేసిన మనుషులు.. అక్కినేని నాగేశ్వరరావుతో హేమాహేమీలు, రాజకీయ చదరంగం వంటి చిత్రాల్లో నటించారు. ఇక చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు వంటి హీరోలతో కలసి కృష్ణ … ఏకంగా 50 సినిమాల్లో నటించి అత్యధిక సినిమాల్లో నటించిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు. నిర్మాతగా వివిధ భాషల్లో 50కి పైగా సినిమాలను నిర్మించారు. 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి కృష్ణ రికార్డు సృష్టించారు.
2000లో కృష్ణకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించగా.. 2009లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. కృష్ణ పేరుతో ఆస్ట్రేలియా ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూగా కృష్ణ సేవలు అందించారు. 1972 జై ఆంధ్ర ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించిన కృష్ణ.. 1984లో రాజీవ్‌గాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రాజీవ్‌గాంధీ మరణంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్, కృష్ణ మధ్య విబేధాలు వచ్చాయి.