Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కృష్ణ మృతి చెందడంతో ఘట్టమనేని కుటుంబంతో సహా యావత్తు సినీ ప్రపంచం దిగ్బ్రాంతికి లోనయ్యింది. ఆయన అకాల మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు అయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. తల్లిని కోల్పోయిన రెండు నెలలు వ్యవధిలోనే తండ్రి కోల్పుయిన మహేష్ ఆవేదన, అతని కన్నీరు చూసి అభిమానులతో పాటు సినీ పెద్దలు కూడా చలించిపోతున్నారు. తెలుగు పరిశ్రమకు పెద్ద దిక్కులాంటి కృష్ణ గారిని కూడా కోల్పోవడం ఎంతో బాధాకరం అంటూ పలువురు ప్రముఖులు వాపోయారు. ఇక అభిమానుల సందర్శనార్థం కోసం ఆయన భౌతికకాయాన్ని నిన్న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తారని కుటుంబ సభ్యులు తొలుత తెలిపారు.
అయితే పలు కారణాల వల్ల కృష్ణ భౌతికకాయాన్ని నానక్‌రామ్‌గూడలోని ఇంటివద్దే ఉంచాల్సి వచ్చింది. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఇంటివద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసుకునేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానాలు… కృష్ణ గారి ఇంటి బయటే ఉన్నా, చివరి సారిగా ఆయనను చూడలేకపోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా టాలీవుడ్ నిర్మాతల మండలి కృష్ణ గారి గౌరవార్థం నేడు షూటింగ్ లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కృష్ణ గారి అంతిమయాత్రలో టాలీవుడ్ నటులు అందరూ పాల్గొనాలంటూ ‘మా’ అసోసియేషన్ పిలుపు నిచ్చింది. కాగా ప్రస్తుతం కృష్ణ భౌతికకాయాన్ని అంతిమ యాత్రగా జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలిస్తున్నారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొని కృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తున్నారు.