ప్రాంతీయ అంశం కాబట్టి కన్నడ ప్రేక్షకులకు నచ్చడం సహజమే…! కానీ, తమకు సంబంధించని సబ్జెక్ట్ అయినా ఇటు తెలుగు ప్రేక్షకులనూ, అటు ఉత్తరాది ప్రేక్షకులనూ విశేషంగా ఆకట్టుకున్న చిత్రం… ‘కాంతార’. ఈ కారణంవల్లే ‘కాంతార’ చిత్రం వసూళ్ల పరంగా సంచలనాలకు తెర తీసింది. ఇది చిత్ర యూనిట్ ని అంతులేని సంతోషానికి గురి చేస్తోంది. ‘కాంతార’ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతోంది. రిషబ్ శెట్టి హీరోగా స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ పలు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లను దాటేసింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం పెద్ద సినిమాలను మించిపోయి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ బోనస్ లతో పాటు ‘కాంతార’ చిత్ర యూనిట్ కి మరో బోనస్ సొంతమైంది. అదేంటంటే, ‘కాంతార’ చిత్రాన్ని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వీక్షించి అచ్చెరువొందారు. ‘తెలిసిన దానికంటే తెలియనిదే ఎక్కువ, అని హోంబలే ఫిలింస్ నిర్మించిన కాంతార చిత్రం కంటే మరెవరూ బాగా చెప్పలేరు. ఈ సినిమా చూశాక నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే అతిశయోక్తి కాదు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా రిషభ్ శెట్టి ప్రతిభకు హ్యాట్సాఫ్. భారతీయ సినీ చరిత్రలో ఇదొక కళాఖండం అనదగ్గ చిత్రం. కాంతార చిత్రబృందం మొత్తానికి అభినందనలు తెలుపుతున్నాను.’ అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.
దీనిపై ‘కాంతార’ దర్శకహీరో రిషబ్ శెట్టి పొంగిపోయారు. తలైవా ట్వీట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘రజనీకాంత్ సర్… భారతదేశంలోనే మీరు అతిపెద్ద సూపర్ స్టార్. బాల్యం నుంచి నేను మీకు అభిమానిని. కాంతార చిత్రాన్ని మీరు అభినందించడంతో నా కల నేరవేరింది. నేటివిటీ ఉన్న మరిన్ని లోకల్ కథలను తెరకెక్కించి, ప్రేక్షకులను అన్నివిధాలా ఉత్తేజితులను చేసేందుకు మీరు నాకు స్ఫూర్తిగా నిలిచారు… థాంక్యూ సర్…’ అని పేర్కొన్నారు. నిజంగా రజనీ అభినందనలంటే మాటలా…!!