టీ20 వరల్డ్ కప్‌ను టీమ్ ఇండియా అద్భుతంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో చివరి దాకా నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు మ్యాచ్ జరగడంతో క్రికెట్ ఫ్యాన్స్ సిసలైన క్రికెట్ మజాను ఆస్వాదించారు.
టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ జట్టులో షాన్‌మసూద్, ఇఫ్తికార్ అహ్మాద్ హాఫ్ సెంచరీలు చేశారు. 160 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు వంద రన్స్ చేసి జట్టును మెరుగైన స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పాండ్య అవుటైనా.. చివర్లో వచ్చిన అశ్విన్ సాయంతో కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు.