వరంగల్ గొప్ప ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రాంతం
వరంగల్ ప్రాంతం గొప్ప చారిత్రక పర్యాటక ప్రాంతమని తాను ఆయా ప్రాంతాలను పర్యటిస్తున్నానని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను హన్మకొండలోని వారి నివాసంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తాను ఉమ్మడి జిల్లాలోని స్థానిక చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను చూస్తున్నాను అని, తనను అవన్నీ మంత్ర ముగ్ధుడిని చేశాయని మంత్రికి చెప్పారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, రైతులకు అందుతున్న సాగునీరు, పంటలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంపు వంటి అంశాల మీద కూడా ఆయన మంత్రితో మాట్లాడి అభినందించారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి, బమ్మెర, వల్మీడి లాంటి చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ఆ ప్రాంతాలను కూడా సందర్శించాలని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ను మంత్రి ఎర్రబెల్లి కోరగా, వారు సానుకూలంగా స్పందించారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సత్కరించారు.