ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర -2022 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్‌చోంగ్తు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. నిధులు విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. గత రెండేండ్లలో రూ.100 కోట్లు, రూ.75 కోట్ల చొప్పున కేటాయించిందని మంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే జాతర కోసం వారం కిందే రూ.2.24 కోట్లతో దుస్తులు మార్చుకోవడానికి గదులు, ఓహెచ్‌ఆర్‌ఎస్, కమ్యూనిటీ డైనింగ్‌హాల్ పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. మిగిలిన అన్ని పనులను డిసెంబర్‌లోపు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. జాతరను ప్లాస్టిక్హ్రితంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో పనులు చేపట్టినట్టు వివరించారు.