రాచకొండ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీపీ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నూతన పంథాలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేలా అధికారులు మరియు సిబ్బందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికత వినియోగంతో పాటు విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలకం పాత్ర పోషిస్తుందని, రాచకొండ కమిషనరేట్ పరిధిలో “విజుబుల్ పోలీసింగ్, సత్వర స్పందన, సాంకేతికత వినియోగం” ఈ మూడింటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అందుకే రాచకొండలో నేరతీవ్రత క్రమంగా తగ్గుతోందని కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు పేర్కొన్నారు.
ప్రతీ ఏరియాలోనూ బ్లూకోల్ట్స్, పెట్రోకార్ మరియు సైకిల్ పెట్రోలింగ్ : నేరాలను అరికట్టడం కోసం మరియు ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంచేందుకు డయల్ 100 మరియు 112 ద్వారా వచ్చే ఫిర్యాదులపై అధికారులు, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ పోలీస్ సిబ్బంది వేగంగా స్పందిస్తున్నారని, బాధితుల వద్దకు వీలైనంత తక్కువ సమయంలో త్వరగా చేరుకునేలా పని చేస్తున్నామని తెలిపారు. గతంలోనూ రాచకొండలో పనిచేసిన అనుభవంతో రాచకొండ పరిధిలోని అన్ని ప్రాంతాల మీద సంపూర్ణ అవగాహన ఉందని, పోలీసు సిబ్బంది అన్ని ఏరియాల్లో, ప్రతి వీధిలోనూ పెట్రోలింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ తో పాటు సైకిళ్ళ ద్వారా పెట్రోలింగ్ చేయడాన్ని మొదలు పెట్టామని, ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని ప్రతీ పోలీసు స్టేషన్కు 3-5 సైకిళ్లను పంపిణీ చేశామని, శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానిక ఠాణా సిబ్బంది ఆయా ప్రాంతాల్లో సైకిళ్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
పెరుగుతున్న మహిళా పోలీసుల భాగస్వామ్యం : ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంలో మహిళా పోలీసుల పాత్రను పెంచేలా క్షేత్ర స్థాయిలో విధుల నిర్వహణలో మహిళా సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిషనర్ గారు తీసుకుంటున్న చర్యల ద్వారా మహిళా సిబ్బంది కూడా ఉత్సాహంగా బ్లూ కోల్ట్స్, పెట్రోల్ కార్ విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళా సిబ్బంది చేస్తున్న సైకిల్ పెట్రోలింగ్ ద్వారా ప్రజలకు పోలిసులపై భరోసా లభిస్తోంది.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో అనేక మంది మహిళ సిబ్బంది పోలీస్ శాఖలో పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వ చొరవతో, మహిళలు కూడా అధిక సంఖ్యలో పోలీసు శాఖలో చేరుతున్నారని, ప్రతి రిక్రూట్మెంట్ లోను ఉత్సాహంగా పాల్గొంటున్నారని కమిషనర్ పేర్కొన్నారు. రాచకొండ మహిళా సిబ్బంది సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక షి టీమ్స్ ద్వారా సమాజంలో స్త్రీలకు ఎదురయ్యే వేధింపుల నుండి రక్షణ కల్పిస్తున్నామని మరియు మహిళలు, చిన్నారులు, వృద్ధుల పట్ల నేరాలకు పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని, డ్రగ్స్ సరఫరా చేసే పలు అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్టు చేసి కఠిన చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పలు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు అహర్నిశలూ పని చేస్తున్నామని, ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని, పోలీస్ సిబ్బంది సంక్షేమంపై కూడా దృష్టిసారిస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రజలు నేర భయం లేకుండా ఉండాలంటే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నేరాలను అదుపు చేయాలని పిలుపునిచ్చారు.