సాధారణంగా దేవాలయానికి వెళ్లి దైవదర్శనం, తీర్థ ప్రసాదాల స్వీకరణ తర్వాత భక్తులు తమ కానుకలను హుండీలో సమర్పించుకుంటారు. ఇది ఎవరి శక్త్యానుసారం వారు చేసే సంప్రదాయం. మరొక విషయమేంటంటే కొందరు భక్తులు ఏవైనా కోరికలు కోరుకుని అవి తీరాక వెళ్లి ముక్కులు తీర్చుకునే క్రమంలో హుండీలో నగదు రూపేణా గానీ, నగల రూపేణా గానీ దైవానికి సమర్పించుకుంటారు.
కానీ ఓ అజ్ఞాత భక్తుడు తెలంగాణలోని ఓ ఆలయ హుండీలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 204 సంవత్సరాల నాటి పురాతన రాగి నాణేన్ని సమర్పించుకుని ఆలయ సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
కామారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం హుండీలో ఈ నాణెం లభించింది. రెండు అణాల విలువైన ఈ నాణేన్ని 1818లో ముద్రించారు. నాణెం ముందువైపు ఈస్టిండియా కంపెనీ అని ఇంగ్లిష్‌లో రాసి వుండగా, మధ్యభాగంలో పైన అటుఇటు వెలుగుతున్న జ్యోతుల మధ్య ‘ఓం’ రాసి వుంది. దాని కింద కమలం పువ్వు, దానికి అటూయిటూ ‘యూకే’ అని రాసి వుంది. రెండు అణాలు అని రాసివున్న దీని కింద భాగంలో 1818 అని తయారైన సంవత్సరాన్ని ముద్రించారు. వెనకవైపు ఆంజనేయ సమేత సీతారాముల బొమ్మను ముద్రించారు. వేలం వేస్తే ఈ నాణేనికి భారీ ధర పలికే అవకాశం ఉందని చెబుతున్నారు.