Weather : ఒక వైపు చలి ప్రజలను వణికిస్తుంటే… ఇప్పుడు తాజాగా వర్షాలు అనుకోని అతిథిలా వచ్చాయి. ఈరోజు తెల్లవారు జాము నుంచే ఒక మోస్తరుగా వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు 12 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ… చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందన్నారు. ఈ వాయుగుండం కారణంగా రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంద్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
చెన్నై-నెల్లూరు మధ్య ఈ వాయుగుండం తీరం దాటనుందని… దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, శ్రీహరికోట, మహాబలిపురం, తిరుపతి జిల్లాల్లో… రాయలసీమ లోని చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే రెండు రోజులు దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చునని వివరించింది.
ఈ రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో దట్టంగా పొగమంచు కురుస్తోంది. అరకు, పాడేరు, చింతపల్లిలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి జిల్లా మినుములూరులో 10, పాడేరులో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.