TS Transco & Genco CMD D Prabhakar Rao, Yadadri Power Plant, BHEL, Minister Jagadish Reddy, Telangana News,
యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఆసుపత్రి నిర్మాణం, పది రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు -మంత్రి జగదీష్ రెడ్డి
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రత్యేక ఆసుపత్రి నిర్మించ తలపెట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. పది రోజుల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేలా ఏర్పాట్లు జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం వీర్ల పాలెం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను ఆయన మంగళవారం ట్రాన్స్కో & జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు తో కలసి సందర్శించారు.
అనంతరం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన బి హెచ్ ఇ ఎల్ అధికారులతో పాటు ట్రాన్స్కో& జెన్కో అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తున్న నేపద్యంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. పనుల్లో జాప్యం జరుగకుండా ఉండేందుకు గాను కార్మికుల్లో ధైర్యాన్ని పెంపొందించేందుకు గాను చేపట్టాల్సిన చర్యలపై మంత్రి జగదీష్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.
కోవిడ్ నేపధ్యంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తున్న ప్రాంగణంలోనే 20 పడకల ప్రత్యేక ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించారు. ఆ ఆసుపత్రి నిర్మాణం 10 రోజుల్లో పూర్తి చేయడం తో పాటు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని ఆయన సూచించారు. తద్వారా కార్మికుల్లో మనోధైర్యాన్ని పెంపొందించడంతో పాటు సిబ్బందికి వైద్య సదుపాయం అందుబాటులో ఉంచగలుగుతామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో బి హెచ్ ఇ ఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ సిసోడియా,ట్రాన్స్కో డైరెక్టర్లు అజయ్, సచ్చితానంద్, టి ఆర్ కే రావు కోల్ సి యం డి జె యస్ రావు, యస్ ఇ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.