Veda Vyasa Jayanthi, Vyasa Maharshi, Guru Poornima, Vyasa Poornima, Bhakthi News, Telugu World Now,
BHAKTHI NEWS:🌹శ్రీగురుభ్యోనమః.🌹గురుపౌర్ణమి (వ్యాసపౌర్ణమి) విశిష్టత: జోస్యులహరిప్రసాద్. తెలుగు అధ్యాపకులు.
శివాజ్ఞతో సమస్త మానవాళికి విజ్ఞానాన్ని అందించి గురువుగా వినుతకెక్కిన వ్యాసమహర్షి జన్మదినమును గురుపౌర్ణమిగా జరుపుకొనుట సంప్రదాయం.
ప్రతిసంవత్సరం దక్షిణాయణం ప్రారంభమయ్యే మొదటి పౌర్ణమిని గురుపౌర్ణమిగా, వ్యాసపౌర్ణమిగా పిలుస్తారు.
ఈ ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజును ప్రపంచంలో ఉండే జైనులు, బౌద్ధులు కూడా పరమపవిత్రంగా కొలుస్తారు.
⛳గురు సంప్రదాయంలో ఆ పరమశివుడే ఆదిగురువు. శివుడు తాండవం చేయు సమయంలో ఆ స్వామివారి చేతి ఢమరుకం నుండి వెలువడే నాదం (శబ్దం)నుండే వేదం ఉద్భవించింది. ‘విద్’అనే ధాతువు నుండి వేదము అనే శబ్దము పుట్టింది. వేదము అనగా అపారమైన జ్ఞానము అని అర్థం. ఈ వేదవిజ్ఞానాన్ని శ్రీమహావిష్ణువు శివుని ఢమరుకం నుండి విని బ్రహ్మ దేవునికి చెప్పగా బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్టమహర్షికి వశిష్ట మహర్షి తనకుమారుడైన శక్తి అనే మహర్హికి శక్తి మహర్షి తన కుమారుడైన పరాశర మహర్షికి పరాశర మహర్షి తన కుమారుడైన శ్రీవ్యాసమహర్షి కి తెలియజెప్పారు.
“వ్యాసోనారాయణోహరిః” నారాయణాంశతో పుట్టిన వ్యాసులవారు ఈ లోకానికి విజ్ఞానాన్ని అందించి మహోపకారం చేశారు. అంతవరకు మౌఖికంగా ఒకరినుండి ఒకరికి నేర్చుకున్న వేదం అంతా ఒకటిగా కలిసిఉండేది.
కలియుగంలో ఉండే మానవుల ఆయుప్రమాణం, వారి బుద్ధిని దృష్టిలో ఉంచుకొని వ్యాసులవారు వేదాన్ని
1.ఋగ్వేదం
2.యజుర్వేదం
3.సామవేదం
4.అధర్వణవేదం
అని నాలుగు విభాగాలుగా విభజించి వేదవ్యాసునిగా వినుతకెక్కారు.
ఈ లోకానికి సులభమైన రీతిలో అర్థమయ్యేటట్లు అనేక వైజ్ఞానిక విషయాలను వెల్లడించారు.ఇప్పుడున్న వివిధ దేవతలకు పూజావిధానం వివిధ ఆగమశాస్త్రాలు, కారికలు, స్తోత్రాలు వివిధ సమస్యలకు పరిష్కారమార్గాలు 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు వంటివి ఎన్నో మనకు అందించారు. ఆ మహర్షి రచించిన పంచమ వేదమైన మహాభారతం ఒక్కటే చాలు.
“యదేహాస్తి తదన్యత్ర
యన్నేహాస్తి నతత్ క్వచిత్”
ఈ ప్రపంచంలో ఏది ఉందో ఆ సమస్త విజ్ఞానమంతా భారతంలోనే ఉంది. ఇందులో లేనిది ఈ విశ్వంలోనే లేదని
కుండబద్దలు కొట్టినట్లు స్వయంగా తానే చెప్పారంటే మన మహాభారతం ఎంత గొప్పదో తెలుస్తున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద ఇతిహాసగ్రంధం(Epic) మహాభారతం. వ్యాసులవారు చెప్పగా శివ పార్వతుల ముద్దుల తనయుడు ఆ గణపతియే రచించాడని ప్రతీతి.
ప్రపంంచంలో ఏ మతగ్రంధాలలోనూ చెప్పనటువంటి అద్భుతమైన కర్మసిద్ధాంతం ఇతర వివరాలను వివరించిన “శ్రీమద్భగవద్గీత” భారతంలోనిదే. విష్ణు, శివ సహస్రనామాలు, యక్షప్రశ్నలు, వివిధ ధర్మసూక్ష్మాలు వంటి అనేక విషయాలు లోకానికి తెలియజేశారు. ఇతర ఋషులవలె హిమాలయాలలో ముక్కుమూసుకుని తప్పస్సు చేసుకోకుండగ మానవ కళ్యాణానికి లోకోపకారార్థం నిస్వార్థ చింతనతో ఇంత చేసిన మహర్షికి కృతజ్ఞత తెలపటం ప్రతి మానవుని విధి.
మానవునికి ఉండే ఋణాలలో ఋషిఋణం ఒకటి. ఆ ఋషి ఋణం మనకు ఉపదేశం చేసిన గురువును, గురుపరంపరను స్మరించుకుని ఎవరైతే వందన సమర్పణ చేస్తారో దేవతలకు కూడా సాద్యం కాని అత్యంత ప్రభావవంతమైన గురు కటాక్షంతో దినదినాభివృద్ధి చెందగలరు. నమ్మకం, భక్తి, విశ్వాసం ప్రధానం. కనుక ఆ మహనీయుని జన్మదినమును పురష్కరించుకుని కృతజ్ఞతా పూర్వకంగా 🌹వ్యాసపౌర్ణమి🌹 జరుపుకొనుట సంప్రదాయం. ఆ తదనంతరం శ్రీశంకరాచార్యులు మొదలుగా మనకు జన్మనిచ్చిన తల్లి నుండి మనకు విద్యాబుద్దులు నేర్పే ప్రతి ఒక్క గురువును కృతజ్ఞతతో వారిని స్మరించడం ఇందలి విశేషము.
🌹 శ్రీగురుచరణారవిందార్పితమస్తు 🌹🌺