Vijay Sethupathi : కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. తెలుగులో విడుదలైన మాస్టర్ సినిమాతో విజయ్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇక ‘ఉప్పెన’ సినిమాతో ఆయన టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు విజయ్. కాగా ఇటీవలే విక్రమ్ మూవీతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు హీరో కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు రూ. 500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి కమల్ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచింది.
ప్రస్తుతం కమల్ ఇండియన్-2 మూవీని ముగించే పనిలో పడ్డాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆర్ధిక ఇబ్బందులు వల్ల గతంలో షూటింగ్ నిలిపి వేయాల్సి వచ్చింది. ఇటీవల మళ్ళీ పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా ఈ సీనియర్ హీరో మరో యువదర్శకుడితో జత కట్టబోతున్నాడు. అజిత్ ‘తునివు’ తెరకెక్కిస్తున్న H వినోద్, కమల్ హాసన్ 233వ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో కమల్ కి విలన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరోసారి నటించనున్నాడట. ఈ వార్తలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.
కాగా కమల్ తన 234వ మూవీని కూడా ఇటీవల అనౌన్స్ చేశాడు. దాదాపు 35 ఏళ్ళ తరువాత మళ్ళీ మణిరత్నం దర్శకత్వంలో ఉలగనాయగన్ నటించబోతున్నాడు. ఈ సినిమాను మణిరత్నం, కమలహాసన్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. ఇటీవలే విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న వీరు ఈ మూవీతో మళ్ళీ హిట్ కొడతారో లేదో చూడాలి.