కాలం మారుతున్నకొద్దీ మనుషుల్ని బాధించే రోగాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే, వీటిలో కొన్ని ఒకసారి సంక్రమిస్తే అవి జీవితాంతం వెంటాడతాయి. అలాంటివాటిలో ఒకటి మధుమేహం. ఇది వంశపారంపర్యంగానూ సంక్రమించవచ్చు, లేదా వృత్తి, వ్యాపారాల్లో టెన్షన్లు పెరిగిపోవడం కూడా సంక్రమించవచ్చు. ప్రస్తుతం రెండో కారణంవల్లే ఈ వ్యాధి తీవ్రత పెరుగుతోందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఆదాయం తక్కువగా వున్నవారు ఎక్కువగా వుంటున్నారు. అలా ఆదాయం తక్కువగా వున్నప్పటికీ టెన్షన్లు ఎక్కువగా వుంటున్నారు. ఒకసారి మధుమేహం సంక్రమించిందంటే జీవితాంతం మందుల్ని వాడాల్సిందే. ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవాలి. ఈ పరీక్షల కోసం వినియోగించే పరికరాలు కూడా కాస్త ఖరీదైనవిగానే వుంటాయి.
ఈ నేపథ్యంలో, విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. దీని సాయంతో టైప్-2 డయాబెటిస్ ను చిటికెలో తెలుసుకోవచ్చు. పైగా ఈ పరికరం అత్యంత చవకైనది. ఈ పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరాన్ని ఆంధ్రా యూనివర్సిటీ బయో కెమిస్ట్రీ విభాగం రూపొందించింది. ప్రొఫెసర్ పూసర్ల అపరంజి నేతృత్వంలో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇది చూడ్డానికి ఓ పెన్ డ్రైవ్ లా కనిపిస్తుంది. ఇందులో వినియోగించే టెస్టింగ్ స్ట్రిప్ లను బయో ఫ్యాబ్రికేషన్ తో తయారుచేశారు. తద్వారా వీటిని 6 నెలల పాటు ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు. ఒక్క రక్తపు చుక్కతో సెకను వ్యవధిలో ఫలితాలు వెల్లడవుతాయి.
అంతేకాదు, ఈ పరికరాన్ని ఫోన్ లేదా ల్యాప్ టాప్ కు అనుసంధానం చేసుకోవచ్చు. అప్పుడు షుగర్ టెస్టు వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. కాగా, ఈ షుగర్ టెస్టు పరికరం టెక్నాలజీపై ఆంధ్రా యూనివర్సిటీ పేటెంట్ కూడా పొందింది. అంతేకాదు, దీన్ని వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి చేసేందుకు విశాఖకు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. సో, చవకైన ఈ పరికరం ద్వారా ఇప్పుడు షుగర్ ప్రస్తుత పరిస్థితిని చిటికెలో తెలుసుకోవచ్చన్నమాట…!!