సామాన్య మానవుడి జీతం పెరగడానికీ, ధరలు పెరగడానికీ ఎక్కడా పొంతన వుండదు. అందుకే, పెద్దగా పెరగని జీతానికీ, ఆకాశంలో వుండే ధరలకూ మధ్య నలుగుతూనే జీవనాన్ని కొనసాగిస్తూంటాడు సామాన్యుడు.
అయితే, ధరలు ఎందుకు పెరుగుతాయి? డిమాండ్, సప్లై. ఈ రెండూ కారణమనే విషయం మనకు తెలిసిందే. పెరుగుతున్న జనాభాకు తగినంతగా ఉత్పత్తి కాని వస్తువుల ధరలకు డిమాండును బట్టి ధరలు పెరుగుతూంటాయి. మార్కెట్ లో ఏ వస్తువులైతే అరుదుగా లభిస్తాయో వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి. అయితే, ప్యాకింగ్ చేసి పైన ధరలను ఉదహరించే వస్తువుల విషయంలో ఎలాంటి దాపరికాలూ వుండవు గానీ, మనం విడిగా కొనే వస్తువుల విషయంలోనే కొన్ని దాపరికాలు వుంటాయి. ఉదాహరణకు ఒక కిరాణా కొట్టులో అతడు మూడు రోజుల క్రితం హోల్ సేల్ రేటులో కందిపప్పు కొన్నాడనుకుందాం. ఈరోజు కందిపప్పు రేటు పెరిగిందనుకున్నాం. అతడు పెరిగిన రేటుకు తను మొన్న కొన్న కందిపప్పును అమ్మేస్తాడు.
దీనివల్ల అతడికి లక్షలు, కోట్ల రూపాయల లాభం వచ్చేస్తుందా? అన్న ప్రశ్న విషయానంతరం. కానీ, వినియోగదారుడు మాత్రం ధరలు పెరగక ముందు దుకాణాదారు కొన్న కందిపప్పును పెరిగిన ధర చెల్లించి కొనుక్కోవలసి వస్తుంది. ఇది అనేక వస్తువుల విషయంలో జరుగుతూంటుంది. కానీ, వినియోగదారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. వినడానికి చిన్న విషయంగానే అనిపించినా వినియోగదారులు ఈ విషయంలో అప్రమత్తంగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ప్రత్యేక కధనం by అన్నమయ్య