తెలుగు సినీ చరిత్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్’కి ప్రత్యేక స్థానం వచ్చింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించి రికార్డులు సృష్టించిన చిత్రం అది. ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ పోటీపడి నటించారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ తమ పాత్రల్లో అదరగొట్టేశారు. అయితే ఈ సినిమాలో ఎవరి పాత్ర ఎక్కువ.. ఎవరిది తక్కువ అనే దానిపై ఫ్యాన్స్ చర్చలకు తెరలేపారు. ఎవరికి అనుకూలంగా వారు తమ అభిప్రాయాలను చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించారు.
ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ పాత్ర చిన్నగా ఉందంటూ ప్రేక్షకులు కొంతమంది అంటున్నారని.. పాత్ర నిడివి కంటే అది ప్రేక్షకుల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిందనేది ముఖ్యమని చెప్పారు. పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ పాత్ర ఉన్నది కాసేపే అయినా దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండేదని గుర్తుచేశారు. రామ్‌చరణ్ పాత్ర కాస్త ఎక్కువే అయినా రెండు పాత్రలనూ దర్శకుడు రెండు కళ్లలా భావించారని పరుచూరి చెప్పారు.
ఈ సినిమాలో తాను రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లను చూడలేదని.. కేవలం అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌నే చూశానన్నారు. సినిమా ప్రారంభం నుంచి రామ్‌చరణ్ ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాడనే విషయం ప్రేక్షకులకు తెలియకుండా చూపించారన్నారు. ఎక్స్‌ప్రెషన్స్ పలికించడం, నటనా పరంగా ఆయన ఏ కాస్త తడబడినా మొత్తం సినిమాపై ప్రభావం చూపించేదని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.