యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS) వారిచే తెలుగు వారికోసం ఆన్ లైన్ లో సాధనా సంగమం నిర్వహించబడుతున్నది.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా(YSS) మార్చి 27, 28 తేదీలలో (శని, ఆదివారాలు) తెలుగులో రెండు రోజుల సాధనా సంగమం ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నది. గతనెలలో ఇలాంటి సంగమం YSS హిందీలో నిర్వహించగా దాదాపు 7 వేల మంది భక్తులు పాల్గొన్నారు. తెలుగులో నిర్వహించబోయే కార్యక్రమానికి కూడా ఇలాంటి ప్రతిస్పందనే ఉంటుందని ఆశిస్తున్నాము.
కరోనా మహమ్మారి రాకకు ముందు, ఔత్సాహిక భక్తులకు పరమహంస యోగానంద గారి విశ్వజనీన బోధనలను వారి వారి మాతృభాషలో అందించడానికి వీలుగా YSS భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో 2, 3 రోజుల కార్యక్రమాలు వివిధ ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తూ ఉండేది. ఈ కార్యక్రమాలలో ధ్యానం, పరమహంసగారు ఇచ్చిన ధ్యాన ప్రక్రియలపై పునశ్చరణ తరగతులు, సత్సంగం, భక్తులకు వారి సాధనకు సంబంధించిన విషయాలపై సలహాలు ఇవ్వడం ఉండేవి. వందల సంఖ్యలో హాజరయ్యే ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి సన్యాసులు స్వయంగా ఆ ప్రదేశాలను దర్శించేవారు.
మహమ్మారి వల్ల కార్యక్రమాలు అన్నీ ఆన్ లైన్ లోనికి మారిపోయినా, పాల్గొనే వారి సంఖ్య తగ్గకపోగా, క్రమక్రమేణ ఆ సంఖ్య పెరుగుతున్నది. నిజానికి, ఈ మహమ్మారి యొక్క అనిశ్చిత సమయాలలో ఈ కార్యక్రమాలు మనుగడకు ఒక ఊతంలా పని చేస్తున్నాయి.
ఈ కార్యక్రమాలలో పరమహంస యోగానందగారు 1916 లో కనిపెట్టిన “శక్తిపూరణ వ్యాయామాలు” అనే ఒక విలక్షణ యోగా వ్యాయామాలు ఒక అంతర్భాగం. రోజుకు రెండుసార్లు చేసే ఈ వ్యాయామాలు ఈ సంస్థ యొక్క ధ్యాన సాధనలలో ఒక ముఖ్యమైన అంగం. దీనితో పాటుగా, శరీరం, మనస్సు, ఆత్మలకు గొప్ప ప్రయోజనం కలిగించే ఇతర ధ్యాన ప్రక్రియలు, ఆధ్యాత్మిక సాధనలు ఉంటాయి. సాధకులు ఆరోగ్యకరమైన, ఆనంద, సమృద్ధికర జీవనానికి కావలిసిన సరియైన దృక్పథం, వైఖరి పొందడానికి ఉపయోగపడే పరమహంసగారి యొక్క “జీవించే కళ” మీద సత్సంగాలు కూడా ఈ కార్యక్రమాలలో ఉంటాయి.
పరమహంస యోగానందగారు అన్నారు: “కలసి ధ్యానం చెయ్యడమనేది—సమూహ అయస్కాంత శక్తి అగోచర ప్రకంపన వినిమయ సిద్ధాంతం ద్వారా—ఆ బృందంలోని ప్రతి సభ్యుని యొక్క ఆత్మసాక్షాత్కార స్థాయిని పెంపొందిస్తుంది.” ఇలాంటి ప్రకంపన వినిమయం కావాలంటే, ప్రత్యక్షంగా ఒకరి సన్నిధిలో మరొకరు ఉండాలని అనుకోవచ్చు. కానీ YSS భక్తులు అందుకు విరుద్ధంగా రుజువు చేశారు. ఇలాంటి ధ్యానాలలో పాల్గోనే భక్తుల పెరుగుదల ఆన్ లైన్ సత్సంగం ద్వారా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని ధ్యానం చేసే ఆత్మలతో కూడిన హద్దులు లేని మందిరాన్ని ఏర్పరచడంలో సంస్థ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది.
భారతదేశంలోని వేలకొలది భక్తుల సౌలభ్యం కోసం, YSS రానున్న మాసాలలో వివిధ భాషలు మాట్లాడే విభిన్న భక్తులు ప్రయోజనం పొందేలా ఆయా ప్రాంతీయ భాషలలో సంగమం లను ఏర్పాటు చేస్తున్నది. 2 రోజుల సంగమాలే కాక వారంలో అనేకసార్లు ప్రాంతీయ భాషలలో 1 నుండి 3 గంటల నిడివి గల ఆన్ లైన్ ధ్యాన సమావేశాలు సంస్థ నిర్వహిస్తున్నది. ఈ ధ్యాన సమావేశాలలో పాల్గొనే వారి సంఖ్య వేలలో ఉంది, నానాటికీ పెరుగుతున్నది. ఆన్ లైన్ కార్యక్రమాకు నిర్వహించే ఏ ఆధ్యాత్మిక సంస్థకైనా ఇది చాలా ప్రోత్సాహకరమైన విషయం.
పరమహంస యోగానందగారు బోధించిన ధ్యాన ప్రక్రియలతో బాటు “జీవించే కళ” సూత్రాలు కలిగినటువంటి యోగదా సత్సంగ పాఠాలు పొందడం, ఈ ధ్యాన సమావేశాలలో పాల్గొనడం ఎలాగో తెలిపే వివరాల కోసం yssofindia.org ని దర్శించండి.