భార్య చనిపోవడంతో ఆ వృద్ధుడు గుంటూరులో ఒంటరిగా ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలకు పెళ్లి జరగడంతో వారు వెళ్లిపోయారు. ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాడు. షుగర్ వ్యాధితో బాధ పడుతున్న ఆయనకు ఓ తోడు ఉంటే బాగుంటుందని భావించాడు. ఇందుకు పేపర్లో పెళ్లిల మధ్యవర్తి నంబరకు ఫోన్ చేసి తనకు ఓ తోడు కావాలని చెప్పాడు.
అటువైపు నుంచి మాట్లాడిన వ్యక్తి ముందుగా పెళ్లి సంబంధాలు చూడటానికి రూ.3వేలు తన అకౌంట్‌లో వేయాలని సూచించారు. అందుకు అంగీకరించిన వృద్ధుడు వారు సూచించిన అకౌంట్‌లో డబ్బులు వేశాడు. తర్వాత ఆమె ఓ ఫోన్ నంబరు ఇచ్చింది. ఆ నంబరుకు ఫోన్ చేసి మాట్లాడగా.. ఆమె వృద్ధుడితో సహజీవనం చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలిపింది. కొన్ని రోజులు ప్రేమగా మాట్లాడి ఆయన్ను బుట్టలో వేసుకొని ఒక రోజు అత్యవసరం అని రూ.లక్ష అడిగింది. ఆయన తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పగా అప్పటి నుంచి ఆయనతో మాట్లాడటం మానేసింది.
రెండు రోజులు తర్వాత వేరే నెంబరు నుంచి మరో అమ్మాయి మాట్లాడింది. జంగారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నా అని తనకు ఎవరూ లేరని, చాలా ఆస్తి ఉందని మంచి తోడు కోసు ఎదురుచూస్తున్నానని తెలిపింది. మొత్తానికి వృద్ధుడ్ని నమ్మించింది. కొన్ని రోజుల తర్వాత ఆయనకు లక్ష అడిగింది. అప్పుగా ఇస్తే వెంటనే ఇచ్చేస్తా అని చెప్పడంతో వృద్ధుడు ఆమె ఖాతాలో డబ్బు వేశాడు. అప్పటి నుంచి ఆమె ఫోన్ మాట్లాడటం మానేసింది.
కొన్ని రోజుల తర్వాత భీమవరం నుంచి మాట్లాడుతున్నా అంటూ మరో అమ్మాయి ఫోన్ చేసింది. ఆమె కూడా ఆయన్ను బుట్టలో వేయడానికి ట్రై చేయగా కోపంతో వృద్ధుడు ఆమె తిట్టేశాడు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోవడం మానేశాడు.
కొన్ని రోజులకు మరో అమ్మాయి మ్యారేజ్ మధ్యవర్తి నుంచి నెంబరు తీసుకున్నా అని మాటలు కలిపింది. తనకు పెళ్లయిందని భర్తలో మగతనం లేదని, పిల్లలు పుట్టక విడాకులు తీసుకుని ప్రస్తుతం అన్నయ్య దగ్గర ఉన్నానని చెప్పింది. తన దగ్గర కోట్ల ఆస్తి ఉందని దానికోసం అన్నయ్య రోజూ తాగి వచ్చి తనని కొడుతున్నాడని చెప్పి ఫోన్లో ఏడ్చింది. ఆమె మాటలను వృద్ధుడు పూర్తిగా నమ్మేశాడు. తనో ముసలివాడినని, భార్య చనిపోయిందని పిల్లలకు పెళ్లి జరిగి వెళ్లిపోయారని చెప్పాడు. దీంతో ఆమె వృద్ధున్ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అని చెప్పింది. తర్వాత ఆమె ఫోన్ చేసి తన అమ్మమ్మ ఆస్తి రిజిస్ట్రేషన్ చేయడానికి రూ. లక్ష కావాలని కోరింది. ఆమె మాటలు నమ్మి ఆ వృద్దుడు తన భార్య నగలు బ్యాంక్‌లో కుదవ పెట్టి డబ్బు ఆమెకు ఇచ్చాడు. డబ్బు తీసుకున్న ఆమె అప్పటినుంచి ఆయనతో మాట్లాడటం మానేసింది.