YSRCP MLA Minister Anil Kumar Yadav Comments on Chandrababu Naidu, AP Poltical News,, TDP,
AP NEWS: టీడీపీనే ఎల్లో ఫంగస్: జలవనరుల శాఖా మంత్రి శ్రీ పి. అనిల్ కుమార్ యాదవ్
మానసిక వ్యాధి వల్లే బాబు జూమ్ లో కాలక్షేపం చేస్తున్నాడు, డా. వైయస్ఆర్ ప్రారంభించిన పోలవరాన్నిశ్రీ జగన్ పూర్తి చేస్తారు, తన ఐదేళ్ళలో పోలవరం నిర్వాసితులలో ఒక్కరికైనా ఎందుకు పునరావాసం కల్పించలేదు బాబూ..?, జైలు బాట పట్టిన వారిని పరామర్శించడం తప్ప, తండ్రీకొడుకులకు ఈ రాష్ట్రంలో మరో పనిలేదు.
1. మొన్న మాక్ అసెంబ్లీ.. నిన్న జూమ్ లో మహానాడు చేసుకుని ప్రభుత్వంపైన చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జూమ్ పార్టీగా అవతరించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు.. గత ఏడాదిన్నరగా ఎక్కడా బయటకు రాకుండా పూర్తిగా జూమ్ కే పరిమితమయ్యారు. 2019 సాధారణ ఎన్నికల నుంచి వరుసగా ఏ ఎన్నిక జరిగినా జగన్ మోహన్ రెడ్డిగారికే ప్రజలు పట్టం కట్టడం, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రాకపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రజలు అడుగడుగునా ఛీత్కరిస్తున్న తరుణంలో, ఇక ఈ రాష్ట్రంలో ఉండీ చేసేది ఏమీ లేదు కాబట్టి, పక్క రాష్ట్రంలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు, అక్కడ నుంచే జూమ్ లో మీటింగ్ లు పెడుతూ, ఆయన చేస్తున్నరాజకీయ కుట్రలు చూస్తుంటే.. ఆయనకు సైకలాజికల్ బిహేవియర్ వ్యాధి ఏదో వచ్చినట్టు కనిపిస్తుంది.
2. రెండేళ్ళ పరిపాలనలో జగన్ మోహన్ రెడ్డిగారు సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన అపర భగీరథుడు స్వర్గీయ డాక్టర్ వైయస్ఆర్ అయితే… ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిగారు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాధాన్యతాపరంగా రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తోన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు నాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైయస్ఆర్ గారిది అయితే.. దానిని 80 వేల క్యూసెక్కులకు పెంచుతుంది జగన్ మోహన్ రెడ్డిగారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా విస్తరించాం. ఎస్పీవీ కింద ప్రాజెక్టులు చేపట్టి, కృష్ణా, గోదావరికి సంబంధించి బ్యారేజిలు కట్టి స్టోరేజీ పెంచబోతున్నాం. దాదాపు రూ. 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నాం.
3. మీరు మాత్రం మీ ఇళ్ళల్లో నుంచి అడుగు కూడా బయటకు వేయలేరు గానీ… ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి గారిపైన విమర్శలు చేయడానికి మాత్రం మీకు నోరు ఎలా వస్తుంది..? ప్రజల పట్ల బాధ్యతగా పనిచేస్తూ, ప్రజల కోసం కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారికి దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.
4. సమాజంలో ఎవరైతే అట్టడుగున ఉన్నారో, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం రూ. 95 వేల కోట్లకు పైగా దళారీ వ్యవస్థ లేకుండా, ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా డీబీటీ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిగారిదే. మొత్తంగా రెండేళ్ళలో రూ. 1.25 లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చాం.
5. కోవిడ్ కట్టడిలోనూ సమర్థవంతంగా పనిచేస్తూ, ప్రజలకు ఏ కష్టం రాకుండా, కోవిడ్ ట్రీట్ మెంటును సైతం ఆరోగ్యశ్రీలో చేర్చి, ప్రజలను కంటికి రెప్పలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు కాపాడుతున్నారు. కోవిడ్ నియంత్రణలో మిగతా రాష్ట్రాల కంటే మనం మెరుగ్గా ఉన్నాం. ఈ విషయాలన్నీ అర్థమై, ఈ రాష్ట్రంలో ఇక పనిలేదని చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ హైదరాబాద్ లో స్థిరపడినట్టు ఉన్నారు.
6. మొన్న లోకేష్ రాష్ట్రానికి వచ్చారు. ఎందుకొచ్చారంటే సంగం డెయిరీ స్కాంలో అరెస్టు అయిన ధూళిపాళ్ళ నరేంద్రను పరామర్శించడం కోసం వచ్చారు, అంతకుముందు ఒకసారి ఈఎస్ఐ స్కాంలో అరెస్టు అయిన అచ్చెన్నాయుడిని పరామర్శించడం కోసం వచ్చారు, మొన్నీమధ్య విశాఖలో చిల్లర రాజకీయ కోసం వెళ్ళాడు. ఎంతసేపటికీ వీళ్ళకు చిల్లర రాజకీయాలు, జైలు బాట పట్టిన వారిని పరామర్శించడానికి తప్పితే ఈ రాష్ట్రంలో తండ్రీకొడుకులకు మరో పని లేకుండా పోయింది. మీ వాళ్ళు చేసే తప్పుడు పనులు, తప్పుడు వ్యవహారాలకు జైలుబాట పట్టడానికి తప్ప మీకు ఈ రాష్ట్రంలో మరో పని ఉందా..
7. ఇక ప్రాజెక్టులంటేనే ఆమడ దూరంలో ఉండే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల గురించి మహానాడులో తీర్మానాలు చేయడం విడ్డూరంగా ఉంది. అధికారంలో ఉన్న గత ఐదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదుగానీ, అన్ని పూర్తి చేశాం, ఇన్ని పూర్తి చేశాం అని డబ్బాలు కొట్టుకున్నారు. తన 5 ఏళ్ళు అధికారంలో ఉంటే పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఒక్క ఇల్లు అయినా మార్చారా.. ? పోలవరం, వెలిగొండ, ఇతర ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్యతాక్రమంలో జగన్ మోహన్ రెడ్డిగారే పూర్తి చేస్తారు. పోలవరం ఎవరు మొదలు పెట్టారో.. ఆయన బిడ్డ పూర్తి చేయటం అన్నది భగవంతుని సంకల్పం. పోలవరం డాక్టర్ వైయస్ఆర్ ప్రారంభించారు.. జగన్ మోహన్ రెడ్డిగారు పూర్తి చేయబోతున్నారు. ఇటువంటి అవకాశం బహుశా అరుదుగా వస్తుంది. రాష్ట్రంలో ఈ ఏడాది రిజర్వాయర్లు నిండాయి, వ్వవసాయం బాగుంది, ఉత్పత్తులు బాగున్నాయి, రైతులు బాగున్నారు.
8. జూమ్ పార్టీకి మీరే అధ్యక్షులుగా, జూమ్ లో మీకు మీరే ముఖ్యమంత్రిగా, మీ వాళ్ళతో మీరే ఒక పరిపాలన పెట్టుకుని వృద్ధాప్యంలో ఆ విధంగా ఆనందపడితే మాకేమీ ఇబ్బంది లేదు. జూమ్ పార్టీకి అధ్యక్షుడిలా చంద్రబాబు, జూమ్ పిల్ల పార్టీ నాయకుడిలా లోకేష్ ఉన్నా మాకు అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలనలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. రేపు 16 మెడికల్ కాలేజీలకు జగన్ మోహన్ రెడ్డిగారు శంఖుస్థాపన చేయబోతున్నారు. ఇదొక చరిత్ర. చంద్రబాబు 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఇంత పెద్ద కార్యక్రమం కలలో అయినా ఊహించారా..?
9. అసలు మీ పార్టీ ఎక్కడ ఉంది. కొన్ని మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని, రోజూ క్షుద్ర రాజకీయాలు చేస్తూ, ఎల్లో ఫంగస్ మాదిరిగా రాష్ట్రంపై దాడి చేస్తున్నారు. శాసన సభ సమావేశాలు నిర్వహిస్తే అసెంబ్లీకి రారు కానీ, చర్చ పెట్టాలని సవాళ్ళు విసురుతున్నారు, చర్చ ఎక్కడ పెట్టాలి, ప్రజాప్రతినిధులు రోడ్డు మీద చర్చించుకుంటారా.. రాష్ట్ర అభివృద్ధి, సమస్యలపై చర్చించుకోవడానికి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన వేదిక శాసనసభ. అక్కడకు రారు. జూమ్ లో మాక్ అసెంబ్లీలు నిర్వహించుకుని మీ భజన మీరు చేసుకుంటారు. జగన్ మోహన్ రెడ్డిగారు గొప్పగా పరిపాలన సాగిస్తున్నారు కాబట్టే, స్థానిక ఎన్నికల్లో 85 శాతం సీట్లు సాధించుకున్నాం. డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వాళ్ళు నోరు ఉంది కదా అని మాట్లాడితే ఎలా..?
10. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో 95 శాతంపైగా హామీలు అమలు చేసి చూపించాం. చెప్పినదానికంటే ఎక్కువే చేశాం. కోవిడ్ ఉన్నా ఏ పథకం ఆపలేదు. అదే చంద్రబాబు ఈ సమయంలో ఉంటే, కుంటి సాకులు చెప్పి పథకాలను కూడా ఎత్తేసేవాడు. ఏ కష్టం వచ్చినా వెన్ను చూపని నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు.