Anand Devarakonda : విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అనంతరం మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో కూడా హిట్ కొట్టాడు. అయితే ఆ తర్వాత వచ్చిన పుష్పక విమానం, హైవే సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘బేబీ’ సినిమా జులై 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అన్నయ్య సినిమాలు, తన సినిమాల గురించి మాట్లాడాడు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. మా అన్న టాక్సీవాలా సినిమా చేస్తున్నప్పుడే నాతో ఓ మంచి సినిమా చేస్తా అని నిర్మాత SKN చెప్పారు. అది ఇప్పుడు ‘బేబీ’తో నెరవేరుతుంది. సినిమాల్లో మా అన్న దారి వేరు, నా దారి వేరు. ప్రేక్షకులు, మార్కెట్.. ఇలా పలు అంశాలని దృష్టిలో పెట్టుకొని సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాము. కథల విషయంలో నిర్ణయం నాదే. మా అన్న ఏది వద్దని చెప్పాడు, ఏది చేయమని చెప్పడు. కానీ నేనే ఫలానా సినిమా, ఫలానా వాళ్ళతో చేస్తున్నాను అని ఒక మాట చెప్తాను అన్నయ్యకి. మా ఇద్దర్ని పోల్చి చూడకండి. ఆయన సినిమాలు వేరు, నా సినిమాలు వేరు. బేబీ ట్రైలర్ చూశాక తను చాలా సంతోషించి మంచి సినిమా చేశావ్ అన్నాడు.