Deepika Padukune : ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒడిదుడుకులు అనేవి సాధారణమే. సినిమా తారల జీవితాలు కూడా సాధారణ మనుషులాలేనని, వారికి కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని మనం తెలుసుకోవాలి. పైగా సెలబ్రిటీలు కావడంతో అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. ఇతరులతో పోల్చితే ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు వారిలోనే అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సినిమా తారల్లో చాలామంది మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలతో తమలో తామే కుంగిపోయీ ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్, బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఘటనలు మనకు తెలిసినవే.
అయితే కొందరు ధైర్యంగా తమ సమస్యలను బయటపెట్టి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ కోవాకే చెందుతుంది. తాజాగా మానసిక ఆరోగ్యంపై నోరు విప్పింది దీపిక. డిప్రెషన్ కారణంగా తానెంత మానసిక వేదన అనుభవించానో గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురైంది. 2014లో డిప్రెషన్ బారిన పడినట్లు మొదటిసారి గుర్తించాను. ఆ సమయంలో అంతా చిత్ర విచిత్రంగా అనిపించేది నాకు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏపని చేయాలన్న ఆసక్తి ఉండేది కాదు. ఎవర్నీ కలవాలనిపించేది కాదు. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడేదాన్ని. బయటికి వెళ్లాలన్నా చిరాకు, భయం వచ్చేది. చాలాసార్లు నా జీవితానికి ఓ అర్థం లేదని, ఇంకా బతికి ఉండకూడదని అనిపించేది. ఆత్మహత్య చేసుకుందామనిపించేది’ అని తన చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంది దీపిక.
ఈ క్లిష్ట సమయంలో తన తల్లిదండ్రులు అందించిన సహకారం మరువలేనిదని, వారివల్లే డిప్రెషన్‌ను అధిగమించానంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ‘ఒకసారి అమ్మానాన్నలు నన్ను చూసేందుకు బెంగళూరు నుంచి ముంబై వచ్చారు. అయితే వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో ఉన్నట్టుండి గట్టిగా ఏడ్చేశాను. అప్పుడు నాలో ఏదో సమస్య ఉందని అమ్మకు అర్థమైంది. నాది సాధరణ ఏడుపు కాదని అర్థం చేసుకుంది. వెంటనే ఓ సైకియాట్రిస్ట్‌ను కలవమని సూచించింది. అమ్మ అందించిన సహకారంతో డిప్రెషన్‌ను అధిగమించాను. అదే సమయంలో నాలాంటి బాధితులు ఇంకెంతమంది ఉన్నారో? అని అప్పట్లో నాకనిపించింది. వారిందరికీ ఈ సమస్యపై అవగాహన కల్పించాలనుకున్నాను. లివ్, లవ్, లాఫ్ ఫౌండేషన్ అలా పుట్టుకొచ్చినదే. నా ద్వారా ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగినా ఈ జీవితానికి సార్థకత ఏర్పడినట్లే అని ఎమోషనల్ అయ్యింది దీపిక. ప్రస్తుతం ఈ భామ చేసిన వ్యాఖ్యలు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.