Yash : కొత్త వాళ్లను ప్రోత్సహించేందుకు, కొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించేందుకు దిల్ రాజ్ ప్రొడక్షన్స్(Dil Raju Productions) అనే నిర్మాణ సంస్థను స్థాపించారు నిర్మాత దిల్ రాజు(Dil raju). ఈ నిర్మాణ సంస్థకు దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి, అన్న కొడుకు హర్షిత్ రెడ్డి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ నుంచి వచ్చిన మొదటి సినిమా బలగం. ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండో సినిమా ఏం వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సోమవారం తమ రెండో సినిమాకు సంబంధించిన టైటిల్‌ని ప్రకటిస్తూ ఓ స్పెషల్ వీడియోను నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాకు ఆకాశం దాటి వస్తావా(Aakasam Dati Vasthava) అనే పేరును ఖరారు చేశారు. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న యష్ మాస్టర్ ఈ సినిమాతో హీరోగా మారనున్నాడు. కార్తీక మురళీధరన్ హీరోయిన్ కాగా శశికుమార్ ముత్తులూరి దర్శకుడిగా, గాయకుడు కార్తీక్ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలియజేయడానికి దిల్ రాజ్ ప్రొడక్షన్స్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ అని చెప్పారు. దర్శకుడు శశి తన జీవితంలో జరిగిన విషయాలనే కథగా రాసుకున్నారన్నారు. ఈ చిత్రానికి సంగీతం బలమని, కార్తీక్ అన్ని పాటలూ అద్భుతంగా చేశారన్నారు. బలగం సినిమా షూటింగ్ సమయంలోనే ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చిందని, అందరూ కొత్త వారే కావాలని దర్శకుడు శశికి చెప్పినట్లు దిల్ రాజ్ చెప్పారు. కొరియోగ్రాఫర్ యశ్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడని చెప్పారు. ప్రేమలో ఉన్నప్పుడు చాలా మంది గొప్పగా మాట్లాడుతుంటారు. వాటిల్లోంచి వచ్చిందే ఈ సినిమా టైటిల్ అని దిల్ రాజు అన్నారు.