Sonu Sood-Rhea Chakraborty : సినిమాల్లో విలన్ పాత్రలు వేసినా కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్(Sonu Sood). ఇప్పటికి తన పౌండేషన్ ద్వారా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు చేతనైన సాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘MTV రోడీస్ సీజన్ 19’. ఈ ప్రాజెక్టులో నటి రియా చక్రవర్తి కూడా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు షూటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం రోజున సోనూసూద్ ప్రాజెక్టులో పనిచేస్తున్న వారి కోసం దోశెలు వేశారు. ఎవరికి ఎలాంటి దోశెలు కావాలో అలా వేసి ఇచ్చాడు. అక్కడకు నటి రియా చక్రవర్తి రాగా.. మీకు ఎలాంటి దోశె కావాలని ఆమెను అడిగాడు. ఆమె కోరుకున్న విధంగా వేసి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సోనూసూద్. ఈ వీడియో చేసిన అభిమానులు అతడి సింప్లిసిటీని చూసి మీపై మాకు ఉన్న గౌరవం మరింత పెరిగింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే.. ఈ వీడియో చూసిన దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు. రియాకు దూరంగా ఉండాలని సోనూసూద్‌ను కోరుతున్నారు. ఆమెకు మీరు దోశెలు వేసి పెట్టడం ఏ మాత్రం నచ్చలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా కొన్ని రోజులు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అందుకనే వారు ఇలా రియాక్ట్ అవుతున్నారు.