Jr Ntr : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈయన్ని కన్నడ సినీ పరిశ్రమలో పవర్ స్టార్ అని, అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్‌కుమార్. ఐదేళ్ల వయసులోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. తండ్రి రాజ్ కుమార్‌తోనూ కలిసి నటించారు. పునీత్ రాజ్‌కుమార్ 1976లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. కొంత విరామం తర్వాత 2002లో అప్పు సినిమా ద్వారా కన్నడ సినీపరిశ్రమలో హీరోగా తెరంగేట్రం చేశారు.
కేవలం సినిమాల తోనే కాకుండా ఎన్నో సేవ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఎంతో పేరు సంపాదించారు పునీత్. కాగా ఈరోజు కన్నడ రాజ్యోత్సవం సంధర్భంగా పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డును బహుకరించారు. ఈ మేరకు ప్రభుత్వమే భారీ ఏర్పాట్లు చేసి ఈ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ టైగర్ ఎన్డీఆర్ కూడా హాజరయ్యారు.
ఈ వేడుకలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ… “నేను ఇక్కడికి అతిధిగా కాదు అప్పు స్నేహితుడిగానే వచ్చా” అంటూ తెలిపారు. ప్రసంగం మొత్తం కన్నడలోనే మాట్లాడిన ఎన్టీఆర్… “అప్పు ఒక గొప్ప నటుడు, గ్రేట్ డాన్సర్ అండ్ సింగర్, అంతకుమించి ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి. పునీత్ చేసిన సేవలు అతని ఎప్పటికి మన మధ్య ఉండేలా చేస్తాయి. ఇంక అప్పుతో గడిపిన క్షణాలు నేను ఎప్పటికి మర్చిపోలేను” అంటూ ఎమోషనల్ అయ్యారు.