Entertainment ఇటీవల విడుదలై బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించిన చిత్రం ‘కాంతార’. భాష, ప్రాంతాలకు అతీతంగా సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి సినిమాకు ప్రస్తుతం ఓ పెద్ద సమస్య ఎదురయింది ఈ సినిమాకే హైలైట్ గా నిలిచిన
‘వరాహ రూపం.. దైవ వరిష్ఠం..’ పాటను కాపీ చేశారంటూ చిత్ర బృందంపై తాజాగా కేరళలోని ఓ సంగీత బృందం ‘థాయికుడమ్ బ్రిడ్జ్’ ఆరోపణలు చేసింది. తమ బృందానికి చెందిన ‘నవరసం’ అనే పాటకు కాపీ చేశారంటూ పేర్కొంది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. అంతేకాకుండా తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా సోషల్ మీడియాలో నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది.
”కాంతార సినిమాకు మాకు(థాయికుడమ్ బ్రిడ్జ్) ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాలోని ‘వరాహరూపం..’పాట మేము రూపొందించిన ‘నవరసం’ పాటలానే ఉంది. మా అంగీకారం లేకుండా ఇలా కంపోజ్ చేయడం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే. స్ఫూర్తిగా తీసుకొని పాటను చేయడానికి, కాపీ చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. అలాగే అది వివాదస్పదం కూడా. అందుకే మేము ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. మేము మా శ్రోతలందరినీ మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం” అని థాయికుడమ్ బ్రిడ్జ్ కోరింది. అంతే కాకుండా ఈ పోస్టుకు కాంతార సినిమా నిర్మాత, సంగీత దర్శకుడు, దర్శకులను ట్యాగ్ చేసింది. అయితే ఈ ఆరోపణలపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు.