PM Modi : గోవాలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి అభినందనలు తెలిపారు. అలానే కేంద్ర సమాచార, ప్రసారా శాఖ కూడా ఒక గ్రాఫికల్ ఇమేజ్‌ను ట్వీట్ చేసింది.
ఈ సంధర్భంగా పలువురు ప్రముఖులు ఇప్పటికే మెగాస్టార్ కి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా చిరంజీవిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా చిరంజీవికి అభినందనలు తెలుపుతూ… కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. అదే విధంగా ఆ పోస్ట్ లో… చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ, ఆదరణనూ చూరగొన్నారు అని తెలుగులో ట్వీట్ చేశారు.
మోదీ ట్వీట్‌కి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ… ‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మీ గొప్ప మాటలకు నా ధన్యవాదాలు’’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఇప్పటికే చిరుకి ఈ అవార్డు రావడం పట్ల పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయగా… అభిమానులంతా మెగాస్టార్ కి కంగ్రాట్స్ చెబుతూ ట్రెండింగ్ చేస్తున్నారు.