Puneeth Rajkumar : కన్నడ పవన్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి… ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన 1975 మార్చి 17న జన్మించారు. ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించారు. ఈయన్ని కన్నడ సినీ పరిశ్రమలో పవర్ స్టార్ అని, అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్‌కుమార్. ఐదేళ్ల వయసులోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. తండ్రి రాజ్ కుమార్‌తోనూ కలిసి నటించారు. 46ఏళ్ల పునీత్ రాజ్‌కుమార్ 1976లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. కొంత విరామం తర్వాత 2002లో అప్పు సినిమా ద్వారా కన్నడ సినీపరిశ్రమలో హీరోగా తెరంగేట్రం చేశారు. కన్నడ నాట పవర్ స్టార్ గా అగ్ర హీరోగా ఎదిగారు. అందరి మన్నలు అందుకుని సాగుతున్న సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా గుండె పోటుతో కన్నుమూశారు.
పునీత్ మరణంతో ఆయన అభిమానులే కాకుండా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనోవేదనకు గురయ్యారు. హీరోగా ప్రేక్షకులను అలరించటమే కాకుండా… ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహిస్తూ వచ్చారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్ కుమార్‌కు ‘కర్ణాటక రత్న’ అనే ప్రతిష్టాత్మకమైన బిరుదును ఇచ్చి గౌరవించింది. నవంబర్ 1న ఈ బిరుదుని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అందచేయనుంది. ఈ కార్యక్రమంలో పునీత్ కుటుంబ సభ్యులందరూ పాల్గొనబోతున్నారు.
కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారాలను కర్ణాటక ప్రభుత్వమే స్వయంగా పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. అలానే ఈ కార్యక్రమానికి పలు చిత్ర పరిశ్రమలకు చెందన అగ్ర హీరోలు హాజరు కాబోతున్నారు. కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ వస్తుండగా… టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారు.