కరోనా ఎక్కడ పుట్టుందీ అనే అంశం వివాదాస్పదమే అయినప్పటికీ, చిన్నపిల్లలైనా చైనా అనే సమాధానం చెప్తారు. ‘ఎక్కడో పుట్టి ఎక్కడో కలసి…’ అనే పాటను మార్చేసి ‘అక్కడే పుట్టి అక్కడే ముంచి…’ అని చైనీయులు పాడుకునే స్థితి కరోనా తొలిదశలోనే కలిగింది. అయితే, చైనాలో ఇప్పటివరకూ అనేకసార్లు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే…! తాజాగా మళ్లీ లాక్ డౌన్ విధించినట్టుగా వచ్చిన వార్తల్ని విన్నాం. కాగా, కరోనా టీకా విషయంలో చైనా మరో ముందడుగు వేసింది.
ఇప్పటి వరకు సూది ద్వారా టీకాను ఇస్తుండగా, ప్రపంచంలోనే తొలిసారి నోటి ద్వారా తీసుకునే టీకాను పంపిణీ చేసింది. కరోనాకు విరుగుడుగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టీకాలన్నీ సూది ద్వారా ఇస్తున్నవే కావడం గమనార్హం. చైనా మాత్రం తొలిసారి నోటి ద్వారా తీసుకునే టీకాను అందుబాటులోకి తీసుకొచ్చి నిన్న షాంఘైలో పంపిణీ చేసింది. ఈ వ్యాక్సిన్‌లో ఉండే ద్రవాన్ని నోటితో పీల్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం 20 సెకన్లలోనే ముగుస్తుంది. ఇప్పటికే వ్యాక్సిన్‌ను పంపిణీ చేసిన చైనా, ఈ నోటి టీకాను బూస్టర్ డోస్‌గా ఇస్తోంది. నోటి ద్వారా టీకాను తీసుకోవడం వల్ల వైరస్ శ్వాసనాళంలోకి వెళ్లకముందే అంతం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
చైనాకు చెందిన కాన్‌సినో బయోలాజిక్స్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. చైనాతోపాటు హంగేరి, పాకిస్థాన్, మలేసియా, అర్జెంటీనా, మెక్సికో దేశాల్లో ఈ టీకాకు పరీక్షలు నిర్వహించింది. ఈ టీకాకు చైనా సెప్టెంబరులోనే అనుమతి ఇచ్చింది. దీంతో తాజాగా పంపిణీ మొదలైంది. కాగా, మనదేశంలో ముక్కుతో తీసుకునే కరోనా టీకాను భారత్ బయోటెక్ ఇప్పటికే అభివృద్ధి చేసినప్పటికీ పంపిణీ మాత్రం ఇంకా మొదలు కాలేదు. అయితే, కరోనా వివిధ రూపాల్లో మరో పదేళ్లపాటు బాధిస్తుందని ఆ మధ్య ఒక మాట వినబడింది. ఇందులో నిజమెంత వరకూ వుందో తెలీదు గానీ, ఇప్పటికైనా కరోనా మనల్ని శాశ్వతంగా వదలిపోతే బావుణ్ణనిపిస్తోంది అందరికీ…!!